తెలంగాణలో రూ.887 కోట్లతో మూడు జూట్ మిల్లులు

September 18, 2021


img

మూడు రోజుల క్రితమే కేరళకు చెందిన మలబార్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో రూ.750 కోట్ల పెట్టుబడితో బంగారు, వజ్రాభరణాల తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదురుచుకొంది. శుక్రవారం మరో మూడు కంపెనీలు రూ.887 కోట్లు పెట్టుబడితో రాష్ట్రంలో జూట్ మిల్లులు స్థాపించేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొన్నాయి. 

గ్లోస్టర్ అనే సంస్థ రూ.330 కోట్ల పెట్టుబడితో వరంగల్‌లో జూట్ మిల్లు స్థాపించబోతోంది. ఎంబీజీ కమోడిటీస్ అనే సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడితో రాజన్న సిరిసిల్లా జిల్లాలో, కాళేశ్వరం ఆగ్రోటెక్ అనే సంస్థ రూ.254 కోట్ల పెట్టుబడితో కామారెడ్డిలో జూట్ మిల్లులు స్థాపించబోతున్నాయి. ఈ మూడు కంపెనీలు ఉత్పత్తి మొదలు పెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి మొత్తం 10,400 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో జూట్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. 

రాష్ట్రంలో జనుము పంటను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది. 

రాష్ట్రంలో ఏర్పాటవుతున్న జూట్ మిల్లులలో ఉత్పత్తి అయ్యే గోనె సంచులు వగైరా ఉత్పత్తులన్నిటినీ మొదటి ఏడేళ్లు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఆ తరువాత మరో 5 ఏళ్లపాటు 75 శాతం, మరో 8 ఏళ్లపాటు 50 శాతం ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. 

రాష్ట్రంలో జనుము పంట లేనందున అది అందుబాటులోకి వచ్చే వరకు జూట్ మిల్లులు పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రవాణాలో రాయితీ ఇస్తుంది. మొదటి రెండేళ్ళు రవాణా ఖర్చులో 75 శాతం, తరువాత రెండేళ్ళు 50 శాతం , 5వ సంవత్సరంలో 25 శాతం రాయితీ చెల్లిస్తుంది. 

మూలధన వ్యయం, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ, విద్యుత్‌పై ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంది.


Related Post