రాజు మృతిపై హైకోర్టులో పిటిషన్‌

September 17, 2021


img

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి పారిపోయిన పల్లకొండ రాజు, స్టేషన్ ఘన్‌పూర్‌  సమీపంలో రైల్వేట్రాక్‌పై చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసులు మూడు రోజుల క్రితమే రాజును అరెస్ట్ చేసారని, అతనిని చంపేసి రైల్వే ట్రాక్‌పై పడేశారని రాజు తల్లి ఈరమ్మ, భార్య మౌనిక వాదిస్తున్నారు. రాజును అరెస్ట్ చేసిన తరువాత కోర్టులో హాజరుపరచకుండా పోలీసులు ఈవిదంగా చేసి తమ కుటుంబానికి తీరని అన్యాయం చేశారని వారు వాదిస్తున్నారు. చిన్నారి కుటుంబానికి అన్యాయం జరిగిందని వాదిస్తున్నవారు ఇప్పుడు తమకు జరిగిన ఈ అన్యాయం గురించి ఏమి చెపుతారని ప్రశ్నిస్తున్నారు. 

రాజు అత్తగారు(మౌనిక తల్లి) యాదమ్మ కూడా పోలీసులే తమ అల్లుడిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజు మృతితో తన కూతురు, 11 నెలల వయసున్న మనుమరాలు దిక్కులేనివారయ్యారని, రాజు జైల్లో ఉంటే కనీసం ఆమెకు భర్త, ఆ పసిపిల్లకు తండ్రి ఉండేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. 

హైదరాబాద్‌లోని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా రాజు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్‌ వేశారు. రాజు ఆత్మహత్యపై అనుమానాలున్నాయని కనుక లోతుగా దర్యాప్తు జరిపించాలని ఆయన పిటిషన్‌లో కోరారు.


Related Post