హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి

September 16, 2021


img

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతించింది. జీహెచ్‌ఎంసీ తరపున దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్‌సాగర్‌ను శుద్ది చేయడానికి జీహెచ్‌ఎంసీ ఏటా కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నపుడు, మళ్ళీ దానిలోనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేయాలనుకోవడం ఎంత వరకు సమంజసం అని  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇకనైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని హుస్సేన్‌సాగర్‌ను కాపాడాలని సూచించారు.     

అయితే వాస్తవ పరిస్థితులు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్కసారికి మాత్రమే హుస్సేన్‌సాగర్‌లో పీఒపీతో చేసిన గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. ఇదే చివరిసారని, వచ్చే సంవత్సరం మళ్ళీ అనుమతించబోమని స్పష్టం చేశారు. కనుక జీహెచ్‌ఎంసీ అందుకు తగ్గట్లుగా ముందే ఏర్పాట్లు చేసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించారు. 

జీహెచ్‌ఎంసీ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం చేసిన ఈ సూచనకు అంగీకరించారు. జీహెచ్‌ఎంసీ తరపున అంగీకారం తెలుపుతూ లిఖిత పూర్వకంగా అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. 

దీంతో ఈ అంశంపై నాలుగైదు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించడమే కాక, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీకి చాలా ఉపశమనం లభించినట్లయింది.


Related Post