గడ్డి పరకను కాను..గడ్డ పారను: ఈటల

September 16, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఇంకా ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ టిఆర్ఎస్‌ నేతలు-ఈటల రాజేందర్‌ మద్య ఘాటుగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈటల రాజేందర్‌ బుదవారం హుజూరాబాద్‌లో మధువని గార్డెన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “నేను గడ్డిపోచవంటివాడినని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. కానీ నేను గడ్డ పారవంటివాడిని. హుజూరాబాద్‌లో కోట్లు కుమ్మరించి నన్ను అవలీలగా ఓడించగలననే భ్రమలో ఉన్న సిఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావులకు నన్ను ఓడించడం కష్టమని ఈపాటికి గ్రహించే ఉంటారు. ఇక్కడ అన్ని గోడలపై మీ ఫోటోలే కనిపించవచ్చు. అవన్నీ గాలి దుమారానికి, వర్షాలకి కొట్టుకుపోతున్నాయి. కానీ ఇక్కడి ప్రజల గుండెల్లో ఉన్న నా ఫోటోను ఎవరూ చెరిపేయలేరు... తొలగించలేరు,” అని అన్నారు.   

“టిఆర్ఎస్‌ పార్టీలో, ప్రభుత్వంలో నాకు సిఎం కేసీఆర్‌ పెద్దపీట వేసి చాలా గౌరవించారని మంత్రి హరీష్‌రావు పదేపదే చెపుతున్నారు. కానీ ఆనాడు నన్ను ప్రగతి భవన్‌ గేటు వద్ద ఆపేసి వెనక్కు తిప్పి పంపించేసినపుడు ఏమైంది ఆ గౌరవం?టిఆర్ఎస్‌లో నాకే కాదు...మీకూ చాలా అవమానాలు జరిగాయి. ఆ విషయం మీ భార్యకు కూడా తెలుసు. అయినా మీరు ఆత్మవంచన చేసుకొంటూ సిఎం కేసీఆర్‌కు బానిసలా వ్యవహరిస్తున్నారు,”  అని ఈటల రాజేందర్‌ అన్నారు. 

“నేను రాజీనామా చేసి ఉపఎన్నికను తేబట్టే సిఎం కేసీఆర్‌కు ఇప్పుడు రాష్ట్రంలో దళితులు, గొల్లకూరుమాలు, బీసీలు అందరూ గుర్తుకువస్తున్నారు. ఇప్పుడు ప్రగతి భవన్‌లో నుంచి తరచూ బయటకు వచ్చి ప్రజల మద్యకు వస్తున్నారు. ఉపఎన్నిక జరిగేలోగా ఇటువంటి మంచి మార్పులు ఇంకా చాలా జరుగుతాయని చెప్పగలను. ఈ ఉపఎన్నిక పాండవులకీ, కౌరవులకి మద్య జరుగబోయే కురుక్షేత్రం వంటిది. ధర్మానికి-అధర్మానికి, న్యాయానికి-అన్యాయానికి మద్య జరిగే ఈ యుద్దంలో నేను పాండవ పక్షాన్న, టిఆర్ఎస్‌ నేతలు కౌరవుల పక్షాన్న ఉన్నారు. కనుక ఈ యుద్ధంలో అంతిమ విజయం నాదే,” అని ఈటల రాజేందర్‌ అన్నారు.


Related Post