టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యులు

September 16, 2021


img

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుదవారం రాత్రి టీటీడీ పాలకమండలి సభ్యులను ఖరారు చేసింది. బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ఇదివరకే నియమించినందున, బోర్డులో 24 మంది సభ్యులను నియమిస్తూ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 

టీటీడీ బోర్డులో తెలంగాణ రాష్ట్రం నుంచి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మైహోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్ధసారధి రెడ్డి, పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి (మహబూబ్‌నగర్‌), మారంశెట్టి రాములు (సిద్ధిపేట), లక్ష్మినారాయణ, రాజేష్ శర్మలకు సభ్యులుగా నియమించింది. 

టీటీడీ బోర్డులో తిరుపతి వైసీపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌ సుధాకర్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిరువురికీ ఓటింగ్ హక్కు ఉండదు కానీ పాలకమండలి సభ్యులకు వర్తించే ప్రోటోకాల్ మాత్రం వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది.      

టీటీడీ బోర్డులో ఛైర్మన్‌, సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి మొత్తం 27 మంది ఉండగా, ప్రత్యేక ఆహ్వానితులు పేరిట మరో 50 మందిని చేర్చడం విస్మయం కలిగిస్తుంది. వీరికి ఓటింగ్ హక్కు ఉండదు. శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు పాలక మండలి సభ్యులుగానే పరిగణిస్తారు. వీరి పదవీకాలం టీటీడీ పాలక మండలితో పాటే ముగుస్తుందని ఉత్తర్వులలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.    

మంది ఎక్కువైతే మఠానికి చేటన్నట్లు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య భారీగా పెరగడంతో వారి మద్య భిన్నాభిప్రాయాలు, విబేధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక టీటీడీ నిర్వహణలో కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా టీటీడీ బోర్డును రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధులతో నింపడం వలన టీటీడీ పాలకమండలి సమావేశాలు రాజకీయ సమావేశాలుగా మారవచ్చు. 


Related Post