ఏపీ ప్రభుత్వమే తెలంగాణకు 4,457 కోట్లు బాకీ ఉంది

September 14, 2021


img

ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్ తెలంగాణ విద్యుత్ సంస్థలు రూ. 6,283.68 కోట్లు బాకీ ఉన్నాయని, ఆ బాకీని తిరిగి చెల్లించాల్సిందిగా వాటిని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్‌ వేశారు. 

దీనిపై తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు స్పందిస్తూ, “ఏపీ ప్రభుత్వమే తెలంగాణకు రూ.4,457 కోట్లు బాకీ ఉంది. కానీ దాని గురించి ఏపీ ప్రభుత్వం మాట్లాడటం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం రూ.2,725 కోట్లు రుణాన్ని తీసుకొంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఆస్తులలో వాటాలు కోరుతున్న ఏపీ ప్రభుత్వం ఇటువంటి అప్పులలో కూడా తన వాటాగా చెల్లించాలి. కానీ చెల్లించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వమే దానిని చెల్లిస్తోంది. అలాగే కృష్ణపట్నం ప్లాంటులో తెలంగాణ డిస్కంలు పెట్టిన పెట్టుబడి వడ్డీతో కలిపి రూ.1,611 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాలి. దానినీ చెల్లించలేదు. ఏపీ జెన్‌కోలో తెలంగాణ వాటాను తిరిగి చెల్లించాల్సి ఉంది. అదీ చెల్లించలేదు. కనుక ఇవన్నీ కలుపుకొంటే ఏపీ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వానికి రూ.4,457 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయం కోర్టులో కూడా చెపుతాము,” అని అన్నారు.


Related Post