పోలీస్ కస్టడీలో తీన్‌మార్ మల్లన్న

August 04, 2021


img

హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి తీన్‌మార్ మల్లన్నను అదుపులోకి తీసుకొన్నారు. ప్రియాంకా అనే మహిళ ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని క్యూ న్యూస్ ఛానల్‌పై దాడిచేసి కొన్ని ఫోటోలు, వీడియోలున్న హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకొన్నారు. 

పోలీసులు తెలిపిన దాని ప్రకారం గత కొంతకాలంగా ఆయనకు, క్యూ న్యూస్ ఛానల్లో పనిచేసి మానేసిన విలేఖరి చిలుక ప్రవీణ్‌కు మద్య గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తీన్‌మార్ మల్లన్న మొన్న సోమవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ప్రవీణ్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు కొన్ని ఫోటోలు ప్రదర్శించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫోటోలలో ఉన్న ప్రియాంక అనే మహిళ మల్లన్నపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్యూ న్యూస్ ఛానల్‌పై దాడి చేసి ఆయనను అదుపులో తీసుకొన్నారు. ఈ ఆపరేషన్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్ ఆపరేషన్‌ టీం, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.           

సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు క్యూ న్యూస్ ఛానల్‌పై దాడి చేసి తీన్‌మార్ మల్లన్నను అదుపులోకి తీసుకొంటున్నప్పుడు ఆయన కార్యాలయ సిబ్బంది, అనుచరులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని చెదరగొట్టి మల్లన్నను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈరోజు ఆయనను ప్రశ్నించిన తరువాత, అవసరమైతే అరెస్ట్ వారెంట్ జారీ చేసి కోర్టులో హాజరుపరచవచ్చని సమాచారం.


Related Post