నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రూ.150 కోట్లు: కేసీఆర్‌

August 02, 2021


img

సిఎం కేసీఆర్‌ సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో జరిగిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం తక్షణం రూ.150 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, “నాగార్జునసాగర్ నియోజకవర్గం చాలాకాలంగా చాలా సమస్యలు పేరుకుపోయాయి. వాటన్నిటినీ నోముల భగత్ నా దృష్టికి తీసుకువచ్చారు. వాటన్నిటినీ తప్పకుండా పరిష్కరించి అభివృద్ధి చేసి చూపిస్తాం. ఉపఎన్నికలో ఇచ్చిన ప్రతీ ఒక్క హామీనీ అమలుచేస్తాం. హాలియా, నందికొండ మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.15 కోట్లు కేటాయిస్తున్నాను. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, హాలియాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు చెరో రూ.15 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేస్తున్నాను.

నియోజకవర్గంలో ఓ డిగ్రీ కళాశాల, కళ్యాణ మండపం, షాదీఖానా, మినీ స్టేడియంలు నిర్మిస్తాం. నియోజకవర్గంలో ఇంతవరకు సరైన ఆసుపత్రి లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. నల్గొండలో వైద్యకళాశాల దానికి అనుబందంగా ఆసుపత్రి వస్తున్నాయి కనుక ప్రస్తుతానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తాం. నియోజకవర్గంలో సాగునీటి సమస్య కూడా ఉంది. దాని కోసం గుర్రంపోడులో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేస్తాం. దానిద్వారా నియోజకవర్గంలోని గ్రామాలలోని సుమారు 10 వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి. దీని కోసం తక్షణం సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశిస్తాను. ఇప్పటివరకు జిల్లాకు మొత్తం 15 లిఫ్టులు మజూరు చేశాం. గుర్రంపోడు లిఫ్టుతో కలిపి అన్నీ 18 నెలలలో పూర్తిచేస్తాం. ఇవన్నీ పూర్తయితే జిల్లాలో నీటికి కరువు ఉండదు," అని అన్నారు.


Related Post