ఈటల ప్రాణానికి నా ప్రాణం అడ్డు: మంత్రి గంగుల

July 21, 2021


img

కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి తనను హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతునారంటూ ఈటల రాజేందర్‌ చేసిన ఆరోపణలపై మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా స్పందించారు. నిన్న కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌కు అప్పుడే ఓటమి భయం పుట్టుకొంది అందుకే ప్రజల సానుభూతి సంపాదించుకొనేందుకు తనను హత్య చేయడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఒకవేళ ఆయనను ఎవరు హత్య చేయించాలనుకొంటున్నారో తెలిస్తే ఆ పేరు బయటపెట్టవచ్చు కదా? ఆయన వద్ద సాక్ష్యాధారాలుంటే వాటిని పోలీసులకి వారిపై నమ్మకం లేకుంటే సిబిఐకి అందజేసి దర్యాప్తు కోరవచ్చు కదా? నిజంగా ఆయనకు అటువంటి అనుమానాలుంటే వీలైనంత త్వరగా పోలీసులకు లేదా సిబిఐకి ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరాలి. ఒకవేళ వాటి దర్యాప్తులో నేను దోషిగా తేలితే రాజకీయాలను శాస్వితంగా వదిలేస్తాను. కానీ ఈటల రాజేందర్‌ తన ఆరోపణలు నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను సవాల్ చేస్తున్నాను.

ఆయనతో నాకు వ్యక్తిగత వైరం ఏమీ లేదు. వేర్వేరు పార్టీలలో ఉన్నందున ఆయనతో నేను రాజకీయంగా పోరాడవలసి వస్తోంది. అవసరమైతే నేనే ఆయన రక్షణగా నిలిచి కాపాడుతాను. కానీ ఈటల రాజేందర్‌క్‌ ఓటమి భయంతోనే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప వాటిలో నిజం లేదని అందరికీ తెలుసు. ఆయన ఇటువంటి ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా ఉపఎన్నికలో ఓడిపోవడం ఖాయం,” అని అన్నారు. 


Related Post