ఒక పొరపాటు చేస్తే భావితరాలు నష్టపోతాయి: సిఎం కేసీఆర్‌

June 21, 2021


img

సిఎం కేసీఆర్‌ ఆదివారం సిద్ధిపేట సభలో మాట్లాడుతూ, “నేను ఒక పొరపాటు చేస్తే భావితరాలు నష్టపోతాయి. కనుక నాకు పొరపాట్లు, చెడ్డపనులు చేసే అధికారం లేదు. చేతనైతే మంచి చేయాలి లేకుంటే ఇంట్లో పడుకోవాలి. నేను నా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా నిత్యం ఇదే చెపుతుంటాను. బంగారి తెలంగాణ సాధనే లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాము. ఇప్పటికే త్రాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరా తదితర సమస్యలన్నిటినీ పరిష్కరించుకొని బంగారి తెలంగాణ దిశలో ముందుకు సాగుతున్నాము. మద్యలో కొన్ని దుష్టశక్తులు, దుష్ట రాజకీయాలను ఎదుర్కోక తప్పడం లేదు. అయితే నా లక్ష్యం సాధనలో ఎవరెన్ని అవరోధాలు సృష్టిస్తున్నా నన్ను ఏమార్చలేరు. నేను అనుకొన్న లక్ష్యం సాధించేవరకు వెనకడుగు వేసేది లేదు. ఇందుకు చాలా ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరం, చిత్తశుద్ధి ఉంటే తప్ప సాధ్యం కాదని నాకు బాగా తెలుసు. ఆనాడు నేడు ఏమేమి చెప్పానో అవన్నీ ఇప్పుడు ప్రజల కళ్ళకు కనబడేలా చేసి చూపిస్తున్నాను. కనుక బంగారి తెలంగాణ కూడా సాధించి చూపిస్తాను. దేశంలో అనేక రాష్ట్రాలు, వాటికి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలాగా అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలుకావడం లేదు. మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి మన సరిహద్దులోని మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లా ప్రజలు తమ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారంటే మనం ఇతర రాష్ట్రాల కంటే ఎంత మెరుగుగా ఉన్నామో అర్ధం అవుతుంది,” అని అన్నారు.         

వైద్య వసతులు: రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్కో రంగాన్ని మళ్ళీ తీర్చిదిద్దుకొంటున్నాము. రాష్ట్రంలో ఎక్కడికక్కడ మంచి వైద్య వసతులు కల్పించుకోవడం కూడా వాటిలో ఒకటి. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలకు అదనంగా కొత్తగా మరో ఏడు ఏర్పాటు చేసుకొన్నాము. వచ్చే ఏడాది రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. మొట్టమొదట కామారెడ్డిలోనే ఏర్పాటు చేస్తాం. ప్రతీ జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నేను భావిస్తున్నాను. తద్వారా వాటికి అనుబందంగా ప్రతీ జిల్లాకు 500 పడకల ఆసుపత్రులు, వాటితో పాటే వైద్యులు వస్తారు. అప్పుడు వైద్యులు జిల్లా కేంద్రాలకు, గ్రామాలకు వెళ్ళేందుకు సంకోచించరు,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post