ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తాం: ఈటల

June 19, 2021


img

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితర నేతలతో కలిసి శనివారం హుజూరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “హుజూరాబాద్‌ ఉపఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నవి. ఈసారి హుజూరాబాద్‌లో ఎగరబోయేది కాషాయజెండాయే తప్ప గులాబీ జెండా కాదు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి గెలవాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదు. జరుగబోయేది కురుక్షేత్ర మహాసంగ్రామంలో చివరికి ధర్మం, న్యాయమే గెలుస్తాయి,” అని ఈటల రాజేందర్‌ అన్నారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతీ పధకానికి కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తోంది. కానీ అవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు టిఆర్ఎస్‌ ప్రచారం చేసుకొని లబ్ది పొందుతోంది. కేంద్రం నిధులతో పౌరసరఫరాలు నడుస్తున్నప్పుడు రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఎందుకు ముద్రించడం లేదు?గడీల పాలనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఈటల రాజేందర్‌ ధైర్యంగా గడీ గోడలను బద్దలుకొట్టి బయటకు వచ్చారు. టిఆర్ఎస్‌లో ఇంకా చాలామంది ఆ గడీలో నుండి బయటకు వచ్చి బిజెపిలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే సిఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా ఆసుపత్రులకు వెళ్ళి రోగులను, వారి బందువులను, వైద్యులను, సిబ్బందిని పరామర్శించలేదు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్‌ భయంతోనే బయటకు వస్తున్నారు. కానీ ఈటల రాజేందర్‌ మంత్రిగా ఉన్నప్పుడు తరచూ ఆసుపత్రులకు వెళ్ళి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుండేవారు. ఈటలకున్న చిత్తశుద్ధి సిఎం కేసీఆర్‌కు లేవు. ఈటల భయంతోనే ఇప్పుడు గ్రామ సర్పంచులకు ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. సిఎం కేసీఆర్‌లో భయం మొదలైందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. ఈసారి హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో బిజెపి గెలుపును టిఆర్ఎస్‌ అడ్డుకోలేదు. హుజూరాబాద్‌లో గెలిచి బిజెపి సత్తా ఏమిటో చూపిస్తాం,” అని అన్నారు. 


Related Post