ఈటల, గంగుల పోటాపోటీ సమావేశాలు

May 17, 2021


img

కరీంనగర్‌లో ముఖ్యంగా...హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ శ్రేణులను తమవైపు తిప్పుకొనేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మంత్రి గంగుల కమలాకర్ పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. యోజకవర్గంలో తన పట్టు నిలుపుకొంటూ పార్టీలో అసంతృప్తులను తనవైపు తిప్పుకొని బలం పెంచుకోవాలని ఈటల రాజేందర్‌ గట్టి ప్రయత్నాలు చేస్తుంటే, పార్టీ శ్రేణులు ఈటల రాజేందర్‌వైపు వెళ్ళిపోకుండా కాపాడుకొంటూనే, ఆయన మద్దతుదారులను ఆకర్షించాలని మంత్రి గంగుల గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టిఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఒత్తిడికి, అయోమయానికి గురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరువర్గాలు జిల్లాలో పోటాపోటీగా సమావేశాలు నిర్వహించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

కరీంనగర్‌ జిల్లాలో ఈటల ప్రధాన అనుచరులుగా ఉన్న పలు మున్సిపల్ చైర్మన్లు, ఛైర్ పర్సన్, జిల్లా పరిషత్, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు తదితరులతో మంత్రి గంగుల వరుసగా సమావేశమవుతూ, పార్టీలో ఉంటే కలిగే ప్రయోజనాలు, ఈటలతో బయటకు వెళితే ఎదురయ్యే కష్టానష్టాల గురించి వివరించి నచ్చజెప్పి టిఆర్ఎస్‌లో కొనసాగేందుకు ఒప్పిస్తున్నారు. ఇదే పనిమీద మంత్రి కేటీఆర్‌ త్వరలో హుజూరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆలోగా ఈటల నుంచి మద్దతుదారులను వేరుచేసి వారితోనే కేటీఆర్‌కు ఘనా స్వాగతం చెప్పించాలని మంత్రి గంగుల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.    

ఈటల రాజేందర్‌ సోమవారం హుజూరాబాద్‌కు వచ్చి తన అనుచరులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కరోనాతో ప్రజలు నానా బాధలుపడుతుంటే వారిని పట్టించుకోకుండా తన నియోజకవర్గంపై గంగుల కమలాకర్ దండయాత్రకు వచ్చారని, తాను ఇంకా రాజీనామా చేయకమునుపే అప్పుడే ఉపఎన్నికల కోసం టిఆర్ఎస్‌ ప్రయత్నాలు చేయడం ఏమిటని ఈటల రాజేందర్‌ ప్రశ్నిస్తున్నారు. 

కొండా సురేఖ దంపతులు ఆదివారం శామీర్‌పేటలోని ఈటల రాజేందర్‌ నివాసానికి వెళ్ళి ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు భవిష్య కార్యాచరణ గురించి చాలా సేపు చర్చించారు. 


Related Post