ఆ విమానం ల్యాండింగ్ ఓ అద్భుతం!

May 07, 2021


img

అన్ని సజావుగా ఉన్నంతవరకు విమాన ప్రయాణం అద్భుతంగానే ఉంటుంది కానీ పొరపాటున విమానంలో ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తినా విమానంలో ఉన్నవారు ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవలసిందే... ఈరోజు ఉదయం నాగపూర్ నుంచి ముంబై బయలుదేరిన ఓ ఎయిర్ అంబులెన్స్‌కి సరిగ్గా అటువంటి పరిస్థితే ఎదురైంది. జెట్ సర్వ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఓ ఎయిర్ అంబులెన్స్ విమానం అత్యవసరంగా నాగపూర్ నుంచి ఓ రోగిని ముంబై తరలిస్తోంది. రోగితో పాటు అతని బందువు, ఓ వైద్యుడు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. 

నాగపూర్ నుంచి విమానం బయలుదేరి గాల్లోకి లేవగానే దానికి ముందువైపు ఉండే టైర్ ఊడిపడిపోయింది. కానీ రోగిని అత్యవసరంగా ముంబై చేర్చవలసి ఉన్నందున విమానాన్ని మళ్ళీ నాగపూర్‌లో దించడం కంటే ముంబైకి వెళ్లడమే మంచిదని భావించిన పైలట్లు ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ అధికారులకు ఈవిషయం తెలియజేశారు. 

వారు ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు ఓ రన్ వేను పూర్తిగా ఖాళీ చేయించి దానిపై ఓ కెమికల్ కలిపిన నీటి మిశ్రమాన్ని పోయించి సిద్దం చేశారు. ఇంతలో నాగపూర్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ముంబై చేరుకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల ప్రకారం ఆ రన్ వే ముందు చక్రం లేకుండా విమానం ల్యాండ్ చేశారు. అయితే కెమికల్ కలిపిన నీటిని రన్ వేపై పోసినందున విమానం ముందుభాగం చక్రం లేకుండా నేలను తాకినప్పటికీ మంటలు చెలరేగకుండా దానిపై జారుతూ ముందుకు వెళ్ళి నిలిచిపోయింది. అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది విమానంపై నీళ్ళు స్ప్రే చేసి మంటలు అంటుకోకుండా కాపాడారు. దాంతో విమానంలో ఉన్న రోగితో సహా అందరూ క్షేమంగా కిందకు దిగారు. 

రోగిని వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. విమానం ముందు చక్రం ఊడిపోవడానికి కారణం తెలియవలసి ఉంది. సంబందిత అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. 


Related Post