లాక్‌డౌన్‌పై సిఎం కేసీఆర్‌ ఏమన్నారంటే...

May 07, 2021


img

తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నందున లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్‌ నిన్న ప్రగతి భవన్‌లో వివిద శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైనప్పుడు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలో లాక్‌డౌన్‌ విధించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ఏమన్నారో క్లుప్తంగా... 

• గత లాక్‌డౌన్‌ నేర్పిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించకూడదని నిర్ణయించాము. 

• కొన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ విధించినా కరోనా తీవ్రత తగ్గడం లేదు. 

• లాక్‌డౌన్‌ విధిస్తే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. 

• లాక్‌డౌన్‌ విధిస్తే రోజువారీ పనులు చేసుకొని బ్రతికేవారు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు.  

• లాక్‌డౌన్‌ విధిస్తే పరిశ్రమలు మూతపడతాయి. వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులు వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది. 

• ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,144 గ్రామాలలో లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్దంగా ఉంది. లాక్‌డౌన్‌ విధిస్తే ధాన్యం కొనుగోలు నిలిచిపోతుంది. రైతులు తీవ్రంగా నష్టపోతారు.  

• లాక్‌డౌన్‌ విధిస్తే రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి, ఆదాయం కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. వారు స్వరాష్ట్రాలకు వెళ్లిపోతే మళ్ళీ వారిని వెనక్కి రప్పించలేము. అంతవరకు పనులు నిలిపోతాయి.   

• .ఇది కరోనా సమస్య కనుక తగు చర్యలు చేపట్టి దానిని అధిగమించేందుకు ప్రయత్నిద్దాము.  

• రాష్ట్రంలో ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. 

• రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేయించి, కరోనా రోగులను గుర్తిస్తాం.

• కరోనా సోకినవారిని గుర్తించి, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి అవసరమైన మందులు అందిస్తాం. 

• ఆక్సిజన్ ఉత్పత్తి చేసే యంత్రాలను కొనుగోలు చేసి అన్ని కరోనా ఆసుపత్రులకు అందజేస్తాం. 

• వారం రోజులలోగా హైదరాబాద్‌తో సహా అన్నీ జిల్లాలో 500 బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ.

• చైనా నుంచి ఒక్కోటి కోటి రూపాయలు చొప్పున 12 క్రయోజెనిక్ ట్యాంకర్లను తక్షణమే కొనుగోలుచేసి రప్పిస్తాం. 

• రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా రోగుల కోసమే ప్రత్యేకంగా 5,980 అవుట్ పేషెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రోగులకు చికిత్స, మందులు అందజేస్తున్నాం.


Related Post