తెలంగాణలో ఆల్ ఈజ్ వెల్: సోమేష్ కుమార్‌

May 06, 2021


img

హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ స్పందించారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే కరోనా అదుపులో ఉందని కనుక సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించవలసిన అవసరం లేదన్నారు. కానీ వారాంతపు కర్ఫ్యూ సూచనను పరిశీలిస్తామన్నారు. సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజల జీవనోపాధి దెబ్బ తినడంతోపాటు కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కరోనా కట్టడికి చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారని, అందుకే రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ఉందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉందని అన్నారు. రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు, మందులు, ఆక్సిజన్‌, కరోనా కిట్లు, పీపీఈ కిట్లతో సహా అన్నీ భారీగా నిలువలున్నాయని తెలిపారు. మరో 5 లక్షల రెమిడిసివిర్‌ ఇంజక్షన్ల కోసం ఆర్డర్ పెట్టమని తెలిపారు. రాష్ట్రంలో 62,000 ఆక్సిజన్‌ బెడ్లున్నాయని తెలిపారు. కరోనా టీకాల కొరత కారణంగా రాష్ట్రంలో 45 ఏళ్ళు పైబడినవారికి మాత్రమే టీకాలు వేస్తున్నామని 18 ఏళ్ళకు పైబడినవారికి ఇంకా టీకాలు వేసే కార్యక్రమం మొదలుపెట్టలేదని సోమేష్ కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా చికిత్స అందరికీ అందుబాటులో ఉన్నందునే ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు హైదరాబాద్‌ వస్తున్నారని అన్నారు.



Related Post