లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచన

May 06, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నందున రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించాలని,  శని,ఆదివారాలలో సంపూర్ణ కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్‌ విధించే ఆలోచన చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నిన్న జరిగిన విచారణకు డిజిపి మహేందర్ రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు హైకోర్టుకు హాజరయ్యి కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించి వివరించారు. కానీ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు  కరోనా కట్టడికి ఏమాత్రం సరిపోవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

రోజుకి లక్ష ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించాలని, అక్కడ లభించే చికిత్సకు గరిష్ట ఛార్జీలు, వసూలు చేసే మందుల ధరలను ప్రజలందరికీ తెలిసేలా ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆదేశించింది. పెళ్ళిళ్ళకు, అంత్యక్రియలు తదితర కార్యక్రమాలకు సంబందించి మళ్ళీ మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల జనసంచారాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా కట్టడికి రెండు రోజుల్లోగా నిపుణుల కమిటీ వేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇంకా ఇటువంటి పలు సూచనలు చేసింది. కనుక ప్రభుత్వం వాటిపై తక్షణమే నిర్ణయాలు తీసుకొని ఈ శనివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా వారాంతపు కర్ఫ్యూ అమలుచేసే అవకాశం ఉంది.


Related Post