టిఆర్ఎస్‌ నేతలకు ఈటల హెచ్చరిక!

May 05, 2021


img

మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ నిన్న తనపై చేసిన విమర్శలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఘాటుగా స్పందించారు. నిన్న హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాగురించి ఇంత చెడ్డగా మాట్లాడుతున్నవారందరూ నిన్నటి వరకు నా సహచరులే. వారు కూడా అనేక సందర్భాలలో సిఎం కేసీఆర్‌ అహంభావ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినవారే. ఇటీవల నేను, గంగుల, మరికొందరు నేతలం కలిసి సిఎం కేసీఆర్‌ను పరామర్శించడానికి ప్రగతి భవన్‌ వెళ్ళినప్పుడు భద్రతాసిబ్బంది మమ్మల్ని లోపలకు అనుమతించలేదు. అప్పుడు గంగుల కూడా సిఎం కేసీఆర్‌ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆయనే సిఎం కేసీఆర్‌ను వెనకేసుకువచ్చి నాపై విమర్శలు చేస్తున్నారు. నేను ఏమిటో వారికి కూడా బాగా తెలుసు. కనుక నాపై విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇదివరకు నాయిని నర్సింహారెడ్డికి మహమూద్ ఆలీ తదితరులకు కూడా ప్రగతి భవన్‌ వద్ద ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 

నేను కేసీఆర్‌ అండదండలతో... ఆయన శిష్యరికంలోనే ఈ స్థాయికి ఎదిగాను. నేను దద్దమ్మని అయితే ఇంత ఎదిగేవాడిని కాను...ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేవాడిని కాను...మంత్రి పదవులు దక్కేవి కావు. కనుక నాపై ఇటువంటి కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తే అది మీకే నష్టం. ఈ యుద్ధం కొనసాగితే నాకంటే మీరే ఎక్కువ నష్టపోతారని గ్రహిస్తే మంచిది. ఎవరి గౌరవం, వారికుటుంది. అధికారంలో ఉన్నాము కదా అని ఎదుటవాడిని తక్కువ చేసి మాట్లాడటం మంచి పద్దతి కాదు. మంత్రి పదవికి రాజీనామా చేయమని సిఎం కేసీఆర్‌ నన్ను అడిగి ఉంటే నేనే రాజీనామా చేసేవాడిని కదా? నన్ను తప్పించడానికి ఇంత డ్రామా ఎందుకు?” అని ఈటల రాజేందర్‌ అన్నారు.


Related Post