హాలియా సభతో సాగర్‌లో కరోనా విస్పోటనం?

April 20, 2021


img

నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కేసీఆర్‌ ఈనెల 14న హాలియాలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకుముందు సుమారు నెలరోజులుగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు వేలాదిమందితో ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాయి. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోందని తెలిసి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా పోటాపోటీగా ఉపఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊహించినట్లే ఇప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు భారీగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. 

హాలియా సభలో పాల్గొన్న సిఎం కేసీఆర్‌, నోముల భగత్ కుమార్‌, టిఆర్ఎస్‌ నేతలు ఎంసీ కోటిరెడ్డి, కదారి అంజయ్యలతో పాటు నియోజకవర్గంలో మొత్తం 160 మంది కరోనా బారినపడ్డారు. సాగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్‌, బిజెపి నేతలకు, కార్యకర్తలకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో ఎంతమందికి కరోనా సోకిందనే విషయం త్వరలోనే బయటపడుతుంది. 

ఇది ఒక్క నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు మాత్రమే పరిమితం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికలు జరిగిన అస్సాం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పుదుచ్చేరి, దేశంలో వివిద రాష్ట్రాలలో ఉపఎన్నికలు జరిగిన నియోజకవర్గాలలో కూడా రాజకీయ పార్టీలు కరోనాను పట్టించుకోకుండా వేలాదిమందితో సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాయి. కనుక త్వరలోనే ఆయా రాష్ట్రాలలో కూడా కరోనా విస్పోటనం ఖాయమనే భావించవచ్చు. 

ప్రజలకు ఆదర్శంగా నిలిచి మార్గదర్శనం చేయవలసిన ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలే కరోనాను కట్టడి చేయడం ఎంత కష్టమో, అది అదుపు తప్పితే ఎటువంటి దుస్థితి ఎదుర్కోవలసి ఉంటుందో తెలిసీ కూడా అందరూ ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వలన ఇప్పుడు ప్రజలందరూ మూల్యం చెల్లించవలసివస్తోంది. 


Related Post