ఈనెల 14న హాలియాలో సిఎం కేసీఆర్‌ ఎన్నికల సభ

April 08, 2021


img

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న సీనియర్ కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డి నుంచి గట్టి పోటీ ఉన్నందున సిఎం కేసీఆర్‌ కూడా రంగంలో దిగుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి ఒక రోజు ముందు అంటే ఈ నెల 14వ తేదీన హాలియాలో లక్షమందితో బహిరంగసభ నిర్వహించబోతున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. 

అధికారంలో ఉన్న టిఆర్ఎస్‌కే ఓటేస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని, ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని అదే...ప్రతిపక్షంలో ఉన్న కె.జానారెడ్డిని గెలిపించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉందందని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు చిరకాలంగా ప్రజలతో అనుబందం ఉన్న తనకే ఓటు వేయాలని, తనను గెలిపిస్తే శాసనసభలో టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తానని కె.జానారెడ్డి వాదిస్తున్నారు. 

ఈ భిన్న వాదనల నేపధ్యంలో సాగర్ ఓటర్లలో ఒకరకమైన అయోమయం ఏర్పడి ఉండవచ్చు. ఎన్నికల ప్రచారానికి ముందు సిఎం కేసీఆర్‌ నిర్వహించబోయే సభతో ఆ అయోమయం తొలగిపోయి, సాగర్ ఓటర్లు టిఆర్ఎస్‌ వైపు మొగ్గుచూపుతారని టిఆర్ఎస్‌ నేతలు భావిస్తున్నారు.    

ఈ వాదనలు, లెక్కలను పక్కన పెడితే, రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుంటే, సిఎం కేసీఆర్‌ స్వయంగా లక్షమందితో బహిరంగ సభ నిర్వహించడం ఎంతవరకు సబబు? అని ఆలోచిస్తే బాగుంటుంది.


Related Post