తమిళనాడులో ఓట్లకు నోట్లు: కమల్ హాసన్‌

April 07, 2021


img

మంగళవారం జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు (అన్నాడీఎంకె, డీఎంకె పార్టీలు) విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బు పంచిపెట్టి ప్రలోభాలకు గురిచేశాయని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్‌ ఆరోపించారు. ఈ ఎన్నికలలో ఆయన కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ యధేచ్చగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లకు డబ్బు లేదా అది అందుకొనేందుకు టోకెన్లు పంచిపెట్టాయని ఆరోపించారు. ఈ నేపధ్యంలో అవసరమైతే రీపోలింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరుతానని కమల్ హాసన్‌ అన్నారు. డబ్బు, టోకెన్ల పంపిణీకి సంబందించి సాక్ష్యాధారాలు తనవద్ద ఉన్నాయని అవసరమైనప్పుడు వాటిని ఎన్నికల సంఘానికి సమర్పిస్తానని అన్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ప్రలోభపెడుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లిప్తంగా చూస్తూ కూర్చోందని కమల్ హాసన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకె, డీఎంకె పార్టీలు ఓటర్లను ఎంతగా ప్రలోభపెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఈ ఎన్నికలలో తమ పార్టీ తప్పకుండా ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందని కమల్ హాసన్‌ అన్నారు. ఆయన తన ఇద్దరు కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్‌లతో కలిసి చెన్నైలోని మైలాపూర్ నియోజకవర్గంలో ఓట్లు వేసిన తరువాత వారితో కలిసి ప్రత్యేకవిమానంలో కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్ళారు. 


Related Post