మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

March 08, 2021


img

నేడు ప్రపంచ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజు మాత్రమే సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గంటలు గంటలు చర్చించినంత మాత్రన్న వారి సమస్యలు పరిష్కారమైపోవు. కేవలం నలుగురి దృష్టికి వస్తాయి అంతే! కనుక అటు ప్రభుత్వం, ఇటు సమాజం కూడా మహిళల సమస్యలను అర్ధం చేసుకొని వారికి అన్నివిదాల సహకరించడం చాలా అవసరం. ముందుగా తల్లితండ్రులు, తరువాత భర్త కుటుంబ సభ్యుల సహకారమే చాలా అవసరం. ఆ తరువాతే సమాజం, ప్రభుత్వం సహకారం అవసరం ఉంటుంది. 

అలనాడు సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకుపోవడం, నిండు గర్భిణిగా ఉన్న సీతమ్మవారిని అడవిలో వదిలేసి రావడం, నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం మొదలు నేటివరకు అనేక యుగాలు మారినా సమాజంలో మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదనే చెప్పాలి. ఆడపిల్ల తల్లి కడుపులో ఉండగానే అబార్షన్ రూపం ప్రాణగండం పొంచి ఉంది. బతికి బట్టకడితే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు నిత్యం సీతమ్మవారిలా అగ్నిపరీక్షలు ఎదుర్కొంటూనే ఉండాలి. స్కూలు దశలోనే పోకిరీల బెడదను మౌనంగా భరిస్తూ చదువుల్లో రాణించాల్సి ఉంటుంది. ఆ తరువాత నచ్చిన విద్య అభ్యసించాలంటే కుటుంబ సభ్యులతో పోరాడి ఒప్పించాలి...ఒప్పించలేకపోతే పెళ్ళి చేసుకొని తనకు తెలియని కుటుంబంలోకి వెళ్ళిపోవలసిందే. అదృష్టం బాగుంటే మంచి భర్త, కుటుంబం లభిస్తుంది లేకుంటే పెళ్లితో ఆడపిల్ల జీవితంలో మరో నరకం మొదలవుతుంది. 

ఉద్యోగం చేస్తున్నట్లయితే అటు ఉద్యోగం, ఇటు ఇంటినీ కూడా సమర్ధంగా నిర్వహించవలసి ఉంటుంది. వేధింపులు, అత్యాచారాలు, అవమానాలను ఒడుపుగా ఎదుర్కొని తప్పించుకొంటూ కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మహిళలదే.

ఈ సమస్యలు, గండాలన్నీ దాటుకొని వృద్ధాప్యంలోనైనా కాస్త ప్రశాంతంగా జీవిద్దామంటే కొడుకులు, కోడళ్ళతో వేగవలసిఉంటుంది. ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు వారికీ...వారి పిల్లలకు సేవలు చేస్తుండవలసిందే లేకుంటే జీవితం ఇంకా దుర్భరం అయిపోయే ప్రమాదం ఉంది. 

ఇలా పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు జీవితాంతం ఇన్ని కష్టాలు, సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొంటూ పురుషులు జీవితంలో రాణించగలరా?కనీసం భరించగలరా? అని ఎవరికివారు ప్రశ్నించుకొంటే మహిళల పట్ల వారి దృక్పదంలో కొంతైనా మార్పు వస్తుంది. మహిళల సమస్యల గురించి చర్చించడం కంటే వారికి కాస్తంత సహకరిస్తే చాలు వారే ఓ మంచి సమాజాన్ని నిర్మించి ఇస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది మైతెలంగాణ.కామ్‌.


Related Post