గోడ మీద తుపాకి ఎప్పుడైనా పేలవచ్చు: కేటీఆర్‌

March 06, 2021


img

ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అధికార టిఆర్ఎస్‌, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ధాలు తీవ్రమవుతున్నాయి. కాంగ్రెస్‌, బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుండటంపై తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. 

ఈరోజు తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ విద్యార్ధి విభాగాన్ని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కొందరు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా చూపకుండా సిఎం కేసీఆర్‌ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అటువంటివారికి సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా బదులిస్తాము. సిఎం కేసీఆర్‌ మౌనంగా ఉన్నారంటే దానర్ధం వారి విమర్శలకు ఆయన జవాబు చెప్పలేరని కాదు. ఆయన నోరువిప్పితే ప్రతిపక్షాలు తట్టుకోలేవు. కానీ ఆయన చాలా సంయమనం పాటిస్తున్నారు. తుపాకీ గోడ మీద ఉన్నంతకాలం అది అలంకారం కోసమే అనుకోవచ్చు కానీ అది పేలితే తట్టుకోవడం కష్టం. కనుక సిఎం కేసీఆర్‌ గురించి అవాకులు చావాకులు పేలడం మానుకోవాలని కోరుతున్నాను.  

బిజెపి నేతలు రాష్ట్రానికి తెచ్చింది...ఇచ్చింది ఏమీ లేదు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తున్న సిఎం కేసీఆర్‌పై నోరు పారేసుకొంటున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేసి వేలాదిమంది ఉద్యోగులను రోడ్డున పడేసేందుకు సిద్దపడుతున్న కేంద్రప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తుందనుకొంటే అత్యాశే అవుతుందని భావిస్తున్నాను. రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకోనప్పుడు బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా బిజెపికి బుద్ది చెప్పాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post