మరో వివాదంలో మేయర్ విజయలక్ష్మి

March 06, 2021


img

హైదరాబాద్‌ మేయర్ జి.విజయలక్ష్మి నెలరోజులలోనే మరో వివాదంలో చిక్కుకొన్నారు. తన క్యాంప్ ఆఫీసుకు జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ నగర కమీషనర్‌కు వ్రాసిన ఓ లేఖ బయటకు రావడంతో సోషల్ మీడియాలో దానిపై దుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెపుతుండగా రాజధాని హైదరాబాద్‌లో నివశిస్తున్న ఆమె తన క్యాంప్ ఆఫీసుకు జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయం ఆమె దృష్టికి రావడంతో శుక్రవారం ఆమె పత్రికాప్రకటన చేయవలసి వచ్చింది. 

తాను నివశిస్తున్న ప్రాంతంలో విద్యుత్ లైన్ నిర్మాణపనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని, అందుకే తాత్కాలికంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరానని, కానీ తన లేఖలో అంశాన్ని వక్రీకరిస్తూ మీడియాలో వస్తున్న వార్తలు, కధనాలు ప్రజలను తప్పు దారి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. ఎవరో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.        

ఆమె మేయర్‌గా  బాధ్యతలు చేపట్టిన మర్నాడే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “హైదరాబాద్‌లో మళ్ళీ వరదలు రాకుండా ఎటువంటి చర్యలు చేపడతారనే...” ప్రశ్నకు సమాధానమిస్తూ “హైదరాబాద్‌లో వర్షాలు కురవకూడదని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను,” అన్న మాటలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె తన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇచ్చుకోవలసివచ్చింది.


Related Post