కాంగ్రెస్ పార్టీ ఇంకా తట్టుకొని నిలబడగలదా?

March 03, 2021


img

తెలంగాణ ఏర్పడినప్పుడు తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనుకొంటే ఓడిపోయింది. ఆ తరువాత వరుస ఫిరాయింపులు, వరుస ఓటములతో చాలా బలహీనపడింది. ఆ దెబ్బల నుంచి ఇంకా కోలుకొనకమునుపే కాంగ్రెస్‌ స్థానంలోకి బిజెపి ప్రవేశించింది. బిజెపి అంతటితో ఆగకుండా సిద్దాంతాలను పక్కనపెట్టి కూడా కాంగ్రెస్‌ నేతలను పార్టీలో చేర్చుకోవడం మొదలుపెట్టింది. దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనపడింది. ఆ తరువాత జరిగిన ప్రతీ ఎన్నికలు టిఆర్ఎస్‌-బిజెపిల మద్య పోటీగా మారిపోవడంతో కాంగ్రెస్‌ అడ్రెస్ లేకుండా పోయింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ పరువు కాపాడేందుకే జానారెడ్డి పోటీ చేస్తున్నారంటే పార్టీ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

అయితే ఇటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ నేతలు పార్టీని కాపాడుకొనే ప్రయత్నాలు చేయకుండా కీచులాటలలో మునిగితేలుతున్నారు. పిసిసి అధ్యక్షుడి నియామకంపై పార్టీలో నేతలు మీడియాకెక్కి మరీ కీచులాడుకోవడం అందరూ చూశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల పేరు చెప్పి పిసిసి అధ్యక్షుడి ఎంపికను వాయిదావేశారు లేకపోతే, టిఆర్ఎస్‌, బిజెపిలతో పోరాడేబదులు తమలోతామే కత్తులు దూసుకొంటూ పోరాడుకొనేవారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలలో కనీసం ఒక సీటు గెలుచుకొని సత్తా చాటుకొందామనుకొంటుంటే ఉరుము, మెరుపులేని పిడుగులా షర్మిళ వచ్చి కాంగ్రెస్‌ను నిలువునా చీల్చేందుకు సిద్దమవుతున్నారు. ఓ పక్క బిజెపి, మరో పక్క షర్మిళ కాంగ్రెస్‌ నేతలను తీసుకుపోతుంటే, వారినే కాపాడుకొంటుందా....వరుసగా వచ్చి పడుతున్న ఎన్నికలనే ఎదుర్కొంటుందా?అనిపించకమానదు. షర్మిళ రాకతో కాంగ్రెస్‌ నష్టపోతుందని అందరికీ తెలిసి ఉన్నప్పటికీ మేల్కొలేదు. అందుకే కాంగ్రెస్‌లో అప్పుడే తొలి వికెట్ పడింది. పిసిసి అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు మేల్కొని పార్టీని కాపాడుకొంటారో లేదా కీచులాడుకొంటూ అందరూ కలిసి ఒకేసారి మునుగుతారో... చూడాలి. 


Related Post