త్వరలో తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

March 03, 2021


img

ఈనెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తవుతుంది కనుక మార్చి 15 నుంచి రెండువారాల పాటు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం తొలిరోజున గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయసభలను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. మరుసటిరోజు సమావేశంలో ఇటీవల మృతి చెందిన టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన తరువాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి దానిపై చర్చ ప్రారంభిస్తారు. మార్చి 18న రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు శాసనసభలో 2021-2022 సం.ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభ, మండలి సభ్యులందరూ బడ్జెట్‌ పద్దులపై అధ్యయనం చేసి అవగాహన ఏర్పరచుకొనేందుకు వీలుగా 19వ తేదీన ఉభయసభలకు సెలవు ఇస్తారు. మార్చి 20 నుంచి 28వరకు బడ్జెట్‌పై చర్చించి 28 లేదా 29న ఆమోదం తెలుపడంతో ఉభయసభల సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తారు. 

నేటికీ హైదరాబాద్‌లో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నందున శాసనసభ, మండలి సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, పోలీసులు అందరూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో భేటీ అయ్యి బడ్జెట్‌ సమావేశాల గురించి చర్చించారు. త్వరలోనే బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడనుంది. 


Related Post