ప్రధాని మోడీ నిర్ణయం సరైనదా...కాదా?

February 26, 2021


img

దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ (పీఎస్‌యు)లలో కేంద్రప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకొని ప్రవేటీకరించాలని నిర్ణయించుకొన్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మొన్న సంచలన ప్రకటన చేశారు. వాటిలో లాభదాయకంగా నడుస్తున్న ఎల్‌ఐసీ, ఎన్టీపీసీ, స్టీల్ ప్లాంట్స్ వంటివి, నష్టాలలో కూరుకుపోతున్న ఎయిర్ ఇండియా వంటి సంస్థలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వం పని పరిపాలన చేయడమే కానీ వ్యాపారం చేయడం కాదని కనుక రక్షణ, అంతరిక్షం, ఆర్ధిక తదితరాలను ఉంచుకొని మిగిలినవన్నీ వదిలించుకొంటామని ప్రధాని మోడీ అన్నారు. వాటిలో పెట్టుబడులు ఉపసంహరించడం ద్వారా సుమారు రూ.2.30 లక్షల కోట్లు సొమ్ము చేతికి అందుతుందని దానిని దేశాభివృద్ధికి దోహదపడే పనులకు వినియోగిస్తామని చెప్పారు. ఏవో కారణాలతో పీఎస్‌యులలో పెట్టుబడులు కొనసాగిస్తూ సమస్యలు ఎదుర్కోవడం కంటే వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించినట్లయితే అవి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఆలోచనలు, విధానాలతో నడిపిస్తూ దేశాభివృద్ధికి దోహదపడతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. పీఎస్‌యుల కంటే ప్రైవేట్ సంస్థలు లేదా కంపెనీల పనితీరు, లాభదాయకత ఎప్పుడూ మెరుగ్గా ఉంటుందని కనుక వాటి ద్వారానే అన్ని రంగాలు శరవేగంగా అభివృద్ధి సాధించగలవని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.    

అయితే ఈ నిర్ణయం సరైనదేనా…అంటే కాదని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నవారు వాదిస్తున్నారు. పీఎస్‌యుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సరైన విధానాలు అవలంభించకపోవడం, రాజకీయజోక్యం కారణంగానే సమస్యలు తలెత్తుతున్నాయి తప్ప వాటి పనితీరులో లోపం ఉన్నందున కాదని వాదిస్తున్నారు. ఈవిధంగా పీఎస్‌యులలో ఉన్న సొమ్మును కూడా ఏదో ఓ సాకుతో తీసి వాడేసుకొంటే భవిష్యత్‌లో సొమ్ము కోసం ప్రపంచబ్యాంక్ ముందు చేతులు జాపవలసి వస్తుందని వాదిస్తున్నారు. దేశంలో నానాటికీ నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల కల్పించకపోగా పీఎస్‌యుల ప్రవేటీకరణతో ఉన్నవాటిని కూడా పోగొట్టి సమస్యను మరింత పెంచుతోందని వాదిస్తున్నారు. 

పీఎస్‌యులలో పెట్టుబడుల ఉపసంహరణపై ఈవిదంగా పూర్తి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వాటిలో ఏది సరైనదో ఏది కాదో కాలమే చెపుతుంది.


Related Post