జూన్‌ 21వరకు ధరణీతో కుదరదు: హైకోర్టు

January 23, 2021


img

ధరణీ పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు మళ్ళీ స్టే పొడిగించింది. ఈసారి ఏకంగా ఆరు నెలలపాటు స్టే పొడిగిస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల అమ్మకం, కొనుగోలుదార్ల వ్యక్తిగత వివరాలను ధరణీలో నమోదు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే అవన్నీ ఒకే సమస్యపై దాఖలైనందున వాటిలో ఐదు పిటిషన్లను కొట్టివేసి రెంటినీ మాత్రమే హైకోర్టు శుక్రవారం విచారణకు చేపట్టింది. ఈ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందని కనుక కొంత సమయం ఇవ్వవలసిందిగా ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ అభ్యర్ధన మేరకు ఈ కేసుల తదుపరి విచారణను జూన్‌కు 21కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ ప్రకటించారు. 

అంటే ఈ సమస్యలకు ప్రభుత్వం ఏదో ఓ పరిష్కారంతో ముందుకువస్తే తప్ప మరో ఆరు నెలల వరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ధరణీ పోర్టల్‌ను వినియోగించలేదన్న మాట! ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణీ పోర్టల్‌ పనితీరు చాలా చక్కగా ఉన్నప్పటికీ, దానిని రూపొందించేటప్పుడు ఇటువంటి చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వలననే దానిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు భావించవచ్చు.


Related Post