ఈసారి కూడా కోదండరాంకు నిరాశ తప్పదా?

January 15, 2021


img

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం 2018 ముందస్తు ఎన్నికలప్పటి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటూనే ఉన్నారు కానీ ఫలించడం లేదు. మళ్ళీ ఈసారి నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నందున ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తదితరులతో ఆయనకు మంచి పరిచయాలే ఉన్నాయి. కనుక మండలి ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆయనతో వారికి మంచి సఖ్యతే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా రెండు చోట్ల పార్టీ అభ్యర్ధులను బరిలో దించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించారు. కనుక కోదండరాంకు కాంగ్రెస్‌ నుంచి మద్దతు ఆశిస్తే అది లభించకపోగా దాని నుంచే పోటీ ఎదుర్కోవలసి వస్తోంది.

టిఆర్ఎస్‌, బిజెపిల నుంచి ఎలాగూ గట్టిపోటీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కోదండరాం పోటీ ఎదుర్కోవలసివస్తోంది కనుక ఆయనకు మళ్ళీ నిరాశ తప్పకపోవచ్చు. ఈ సమస్య ప్రతీ ఎన్నికలలోను ఎదురవుతూనే  ఉంటుంది కనుక దీనికి తెలంగాణ జనసమితి తగిన పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది.

రాష్ట్రంలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నడుమ తెలంగాణ జనసమితి మనుగడ సాగించగలదేమో కానీ ఎన్నికలలో వాటిని ఢీకొని ఓడించడం కష్టమేనని ఇప్పటికే అర్ధమయ్యుండాలి. ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలతో ఎటువంటి ఫలితం రావడం లేదు కనుక ఇకనైనా సరికొత్త ఆలోచనలు, విధానాలతో ముందుకు సాగవలసి ఉంటుంది. లేకుంటే ఎప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోవచ్చు.


Related Post