నాని నిర్మాతగా 'అ!'

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా పూర్తి స్థాయిలో ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఆ సినిమానే అ!. సినిమా చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారని అంటున్నాడు నాని. ప్రపంచంలో నేను.. నాలోని ప్రపంచం అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా నాని అభిరుచికి తగిన సినిమాగా వస్తుందని అంటున్నారు. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నాని దగ్గరకు వాయిస్ ఓవర్ కోసం వచ్చాడట. కథ బాగుంది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారని అడిగితే చూడాలి అన్నాడట.

ఇక నిర్మాతగా తనకు ఇదే మంచి అవకాశం అనుకున్న నాని ఈ సినిమా తాను నిర్మిస్తా అని చెప్పి మిగతా వారి సపోర్ట్ తీసుకున్నాడట. నానితో పాటు రవితేజ కూడా ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం నాని చేపకు, రవితేజ మొక్కకు వాయిస్ ఓవర్ ఇస్తారని అంటున్నారు. అంతేకాదు సినిమాలో నిత్యా మీనన్, రెజినా, కాజల్ లాంటి స్టార్స్ నటిస్తుండటం విశేషం. 

మరి నాని చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం ఎలా ఉండబోతుందో చూడాలి. 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారని చెబుతున్నాడు నాని.