
మొదట కామెడీ నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకొన్న బండ్ల గణేష్, ఏదో లాటరీ పేలినట్లు హటాత్తుగా పెద్ద నిర్మాతగా మారిపోయి ఒకప్పుడు తను ఎవరి పక్కన కామెడీ వేషాలు వేశాడో, ఆ హీరోలనే పెట్టి బారీ బడ్జెట్ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆయన వైకాపా నేత బొత్స సత్యనారాయణ బినామి అనే మాట పదేపదే వినిపిస్తూనే ఉంది. దానిని అయన ఖండిస్తూనే ఉన్నా ఎవరూ నమ్మడం లేదు. అది వేరే సంగతి.
ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోలకు కోట్ల రూపాయిలు పారితోషికం ఇచ్చి సినిమాలు తీస్తున్న బండ్ల గణేష్ ‘టెంపర్’ సినిమాకు కధ అందించిన వక్కంతం వంశీకి రూ.25 లక్షలు చెల్లించలేడంటే నమ్మశక్యంగా లేదు. వంశీకి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యి కేసు వేస్తే ఏమవుతుందో తెలియదనునుకోలేము. కానీ ఆశ్రద్దో నిర్లక్ష్యమో మరొక కారణం చేతో వంశీకి ఆ డబ్బును చెల్లించకపోవడంతో ఆయన హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం బండ్ల గణేష్ కు ఆరు నెలల జైలు శిక్షతో బాటు రూ.15,86,550 జరిమానా కూడా విదించింది. కానీ బండ్ల గణేష్ బెయిలు దరఖాస్తు చేసుకోవడంతో దానిని న్యాయస్థానం అంగీకరించి, షరతుల కూడిన బెయిల్ మంజూరు చేసింది. చెక్ బౌన్స్ అయితే ఇటువంటి అవమానకరమైన పరిస్థితి ఎదురవుతుందని తెలిసి ఉన్నప్పటికీ, సినీ పరిశ్రమలోవారు దానిని లైట్ గా ఎందుకు తీసుకొంటారో తెలియదు.