నిజమే..వర్మ మహా మొండోడు

రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా చిత్రం వంగవీటి కంటే దానిపై అతనికి వంగవీటి రాధాకృష్ణకి మద్య జరుగుతున్న మాటల యుద్ధం చాలా ఇంటరెస్టింగా ఉంది. ఒకప్పుడు విజయవాడలో కుల రాజకీయాలు, ఫ్యాక్షన్ హత్యలు చాలా జోరుగా సాగేవి. ఆ సమయంలో వంగవీటి మోహన్ రంగా కూడా చక్రం తిప్పారు చివరకు హత్య చేయబడ్డారు. ఇంగ్లీషు సినిమా హీరోలు చేతిలో తుపాకులు లేకుండా, మన భారతీయ హీరోలు డ్యాన్సులు లేకుండా ఏవిధంగా సినిమాలు చేయలేరో వర్మ కూడా హత్యలు, రక్తపాతం లేనిదే సినిమాలు తీయలేడు. అందుకే ఆ నేపధ్యం పుష్కలంగా ఉన్న వంగవీటి కధని ఎంచుకొని చకచకా తీసిపడేశాడు. 

ఊహించినట్లుగానే ఆ సినిమాపై గొడవ మొదలయింది. దానిని వర్మ తన స్టయిల్లో చాలా బాగా రక్తి కట్టించాడు. సినిమా విడుదలకి ముందు వంగవీటి కుటుంబ సభ్యులతో విజయవాడలో చర్చలు కూడా జరిపాడు. దానితో సినిమాకి ఇంకా హైప్ క్రియేట్ చేశాడు. షరా మామూలుగా దానిలో కొన్ని సీన్లు తీసేయాలని వంగవీటి వర్గం, ససేమిరా అని రామ్ గోపాల్ వర్మ. వారి వాదనలతో సినిమాకి చాలా ఫ్రీ పబ్లిసిటీ, మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆ హైప్ మద్యనే సినిమా రిలీజ్ అయిపోయింది కూడా. సినిమాకి పెద్దగా మార్కులు పడలేదు కానీ ఇప్పుడు వర్మకి వంగవీటి రాధాకృష్ణకి మద్య జరుగుతున్న ‘బస్తీమే సవాల్’ అనే యుద్ధం స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగా ఉండటంతో దానికి మాత్రం చాలా మంచి మార్కులే పడుతున్నాయి. 

“ఎవడో పకోడీగాడు...బుద్ధి లేకుండా సినిమా తీసేసినంత మాత్రాన్న రంగా ఇమేజ్ ఏమీ దెబ్బతినదు. రంగా అంటే ఒక బ్రాండ్ నేమ్...దానిని వర్మ లాంటి వేస్ట్ ఫెలోగాడు తీసిన సినిమాతో దెబ్బ తినదు. రంగా జీవిత కధని వక్రీకరించి తీసినందుకు వర్మకు తగిన విధంగా బుద్ధి చెపుతాను,” అని వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. 

ఆ హెచ్చరికకి వర్మ ఇచ్చిన సమాధానం బహుశః రాధాకృష్ణ వర్గం కూడా ఊహించి ఉండరు. 

“రంగా ఏమైనా గాంధీయా, గౌతమ బుద్ధుడా లేకపోతే మథర్ ధెరిసా వంటివాడా...మహాత్ముడిలాగ చూపించడానికి? ఆయన మర్డర్ల సంగతి పక్కన పెట్టి చీమకి కూడా అపకారం చేయని గొప్ప వ్యక్తి అని చూపించాలా?

రంగా, ఆయన భార్య రత్నకుమారి గురించి నా వద్ద ఉన్న డాక్యుమెంటరీ ఆధారాలు బయటపెడితే రంగా అనుచరులు కూడా చూడలేరు. ఒకవేళ రాధాకృష్ణకి దమ్ము ఉంటే చెప్పమనండి అవన్నీ బయటపెట్టేస్తాను.  రంగా, రాధలపై ఉన్న గౌరవంతోనే వాటిని నా సినిమాలో చూపించలేదు. అసలు నేను వారి జీవిత కధని సినిమాగా తీశానని అనుకోవడమే పెద్ద తప్పు. వారి జీవిత కధల ఆధారంగా ఆనాడు జరిగిన కొన్ని సంఘటనలని, ఆ సమయంలో వారి భావోద్వేగాల్ని మాత్రమే చూపించాను. కానీ ఒరిజినల్ రంగా, రాదాలకున్న విలువలో 0.1 శాతంకూడా ఇప్పటి రాదాకి లేకపోవడం వలననే ఈ స్థితిలో ఉన్నాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అతను బెదిరిస్తే భయపడిపోవడానికి ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదు. నేనే వాళ్ళకి సవాలు విసురుతున్నా బస్తీ మే సవాల్...ప్లేస్ నేను చెప్పను..టైం నువ్వు చెప్పకు..సరేనా?” అని రామ్ గోపాల్ వర్మ సవాలు విసిరాడు. 

“రామ్ గోపాల్ వర్మ మొండోడు..ఎవరికీ భయపడడు...చిన్నా పెద్దా చూడడు..నోటికి ఎంత వస్తే అంతా అనేస్తాడు..”అనే జనాభిప్రాయం నిజమేనని మరోసారి నిరూపించి చూపుతున్నాడు. సినిమా సంగతి ఎలా ఉన్నప్పటికీ విజయవాడలో చాలా బలమైన వర్గంగా పేరున్న వంగవీటిని డ్డీ కొంటున్నాడు..పాపం వర్మ ఏమవుతాడో ఏమో...