రికార్డుల మొత మోగిస్తున్న శాతకర్ణి..!

నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. క్రిష్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టేలా ఉన్న సినిమా ట్రైలర్ అదరహో అనిపించింది. అంతేకాదు రిలీజ్ అయిన 4.5 గంటల్లో మిలియన్ మార్క్ క్రాస్ చేసిన శాతకర్ణి 24 గంటల్లోనే 2.13 మిలియన్ వ్యూయర్ కౌంట్ సాధించింది దీన్ని బట్టి చెప్పేయొచ్చు బాలయ్య స్టామినా ఏంటో. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంతో తీస్తున్న ఈ సినిమా కేవలం 8 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హేమమాలిని గౌతమిగా నటిస్తుంది. చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయి బాబులు నిర్మిస్తున్నారు. బడ్జెట్ కూడా మితిమీరకుండా కేవలం 40 కోట్లలోనే ముగించేశారట. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తోనే రికార్డులను స్టార్ట్ చేశాడంటే ఇక సినిమా బాక్సాఫీస్ మీద దండయాత్ర షురూ అయినట్టే.

సినిమా ట్రైలర్ గురించి పరిశ్రమలోని ప్రముఖులంతా తమ అభిప్రాయాన్ని ట్వీట్స్ రూపంలో వ్యక్తపరిచారు. ఏది ఏమైనా బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటిని కాదని క్రిష్ తో శాతకర్ణి అంటూ ఎనౌన్స్ చేసిన సమయంలో కాస్త కంగారు పడ్డ నందమూరి అభిమానులు ఈ ట్రైలర్ చూసి మీసం మెలేస్తున్నారు. భారీ అంచానాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.