.jpg)
నందమూరి బాలకృష్ణ, శ్రీయ, హేమమాలిని తదితరులు ముఖ్యపాత్రాలలో నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. కరీంనగర్ లో కోటిలింగాల వద్దగల కోటేశ్వర స్వామి ఆలయంలో బాలకృష్ణ తదితరులు అందరూ కలిసి ప్రత్యేక పూజలు చేసిన తరువాత స్థానిక తిరుమల ధియేటర్ లో ఈరోజు సాయంత్రం విడుదల చేశారు.
విశేషం ఏమిటంటే, బాలకృష్ణకి ఇది 100వ చిత్రం గనుక ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 100 దియేటర్లలో ఒకేసారి విడుదల చేశారు. ట్రైలర్ చాలా అద్భుతంగా, చాల రిచ్ గా బాహుబలిని మరపిస్తున్నట్లుంది. ఈ సినిమాలో మరో గొప్ప విశేషం ఏమిటంటే అలనాటి అందాల నటి హేమమాలిని మళ్ళీ నాలుగున్నర దశాబ్దాల తరువాత ఈ తెలుగు చిత్రంలో బాలకృష్ణకు తల్లిగా నటిస్తున్నారు. ఆమె 1965లో విడుదలైన పాండవ వనవాసం చిత్రంలో ఆ తరువాత 1971లో విడుదలైన శ్రీకృష్ణ విజయం చిత్రాలలో నటించారు. ఈరోజు విడుదలైన ట్రైలర్ లో ఆమెని చూడవచ్చు. ఆమె చాలా రాజసం ఉట్టిపడుతూ కనిపిస్తున్నారు.
దర్శకుడు క్రిష్ ట్రైలర్ లో యుద్ద సన్నివేశాలు, సైన్యం కదలికలు వంటివి చాలా అద్భుతంగా చూపించాడు. ట్రైలర్ ని బట్టి చూస్తే సంక్రాంతికి కత్తి పట్టుకొని వస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి, మెగా ఖైదీ నెంబర్:150తో జరుగబోయే యుద్దంలో తప్పకుండా గట్టిగా నిలబడి పోరాడుతాడనిపిస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి జనవరి 12న , ఖైదీ నెంబర్:150 జనవరి 13న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. కానీ అంతకంటే ముందు ఈ ట్రైలర్ చూడాల్సిందే!