
శుక్రవారం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఫౌజీ’ నుంచి ఫైల్ నంబర్ :25 డీకోడ్ అంటూ ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు.
ఇదేదో బాహుబలి రేంజ్లో ఉంటుందని ఎవరూ ఊహించుకోవద్దని నిర్మాత నవీన్ ఎర్నేని ముందే చెప్పారు. కానీ ఇది అంతకంటే గొప్పగానే ఉంది.
ఫౌజీ ఫైల్ నంబర్ :25 డీకోడ్ అంటూ నిన్న ఉదయం నుంచి ఊరిస్తూ వీడియో విడుదల చేయకుండా చాలా ఆలస్యం చేసినా, చివరికి అందరూ సంతోషపడేలా చేశారు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఇది చూసి ఉప్పొంగిపోతారు.
భారత స్వాత్రంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన సుభాష్ చంద్రబోస్, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జర్మనీ అధినేత హిట్లర్ని కలిసి సాయం కోరినట్లు చూపుతూ, ఫౌజీని పరిచయం చేసిన విధానం అద్భుతంగా ఉంది. చివర్లో ప్రభాస్ ఎంట్రీ, డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ వీడియో గురించి వివరించడం కంటే స్వయంగా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
హనూ రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’లో ప్రభాస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన యోధుడుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్గా ఇమాన్వీ నటిస్తున్నారు. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ‘ఫౌజీ’ వచ్చే ఏడాది మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.