సౌండ్ ఇంజనీరు హీరోయిన్‌ నయన్ సారిక

నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న ‘సౌండ్ ఇంజనీరు’ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె పోస్టర్‌ విడుదల చేశారు. 

చినిమిల్లి మణికుమార్ దర్శకత్వంలో ‘సౌండ్ ఇంజనీర్’అంటే వినికిడి లోపం ఉన్నవాడిగా నారా రోహిత్‌ నటిస్తున్నారు. ఆలాంటి వ్యక్తితో హీరోయిన్‌ ప్రేమలో పడితే ఆ కామెడీ  ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే రామ్‌ చరణ్‌-సమంతల రంగస్థలం సీన్లు గుర్తుచేసుకోవాల్సిందే. 

ఈ సినిమాలో నరేష్, రోహిణి, సంపత్, అజయ్, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కరుమంచి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

సౌండ్ ఇంజనీర్‌కు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చినిమిల్లి మణికుమార్; సంగీతం: యువన్ శంకర్ రాజా;  కెమెరా: వెంకట్ సి దిలీప్; ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్ చేస్తున్నారు. 

కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీలత చెరుకూరి సమర్పణలో భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

ఈ సినిమాతో పాటు వెంకటేష్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబంలో నారా రోహిత్‌ పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత రామ్‌ గన్ని దర్శకత్వంలో ‘కపాలి’ అనే ఓ సినిమా మొదలుపెడతారు.