‘సంబరాల ఏటి గట్టు’ నిర్మాతకు బెదిరింపులు.. నిజమేనా?

నూతన దర్శకుడు కేపీ రోహిత్ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ హీరోగా చేస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా నిర్మాతలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వచ్చింది. 

ఆ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

సంక్రాంతి పండుగకు పెద్ద హీరోల పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. కనుక వాటి మధ్య వాటికి పోటీగా ‘సంబరాల ఏటి గట్టు’ విడుదల చేయడం అవసరమా? వేరే నెలకు మార్చుకోమని సదరు వ్యక్తులు బెదిరించినట్లు సమాచారం. లేకుంటే ఆ రోజున సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని బెదిరించినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ బెదిరింపులు నిజమా కాదా? అనే విషయం నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి స్పందిస్తే తెలుస్తుంది. ఒకవేళ వారు స్పందించకపోయినా, తమ సినిమా రిలీజ్‌ డేట్ మార్చుకున్నా ఈ బెదిరింపులు నిజమేనని అనుమానించాల్సి ఉంటుంది.     

రాయలసీమ నేపధ్యంలో తీస్తున్న ఈ సంబరాల ఏటి గట్టు యాక్షన్ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్‌, అనన్య నాగళ్ళ ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రోహిత్ కేపీ; సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్; కెమెరా: వట్రివేల్ పళనిసామి; ఎడిటింగ్: నవీన్ విజయ్ కృష్ణ చేశారు.     

ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమాని కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.