
ప్రభాస్-హనూ రాఘవపూడి కాంబినేషన్‌లో సిద్దమవుతున్న ‘ఫౌజీ’ ఫస్ట్ గ్లిమ్స్ రేపు (శుక్రవారం) విడుదల కాబోతోంది. నిర్మాత నవీన్ ఎర్నేని ఈ విషయం స్వయంగా ‘దొంగ నా కొడుకు’ టీజర్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు. అయితే ఈ వీడియో ఫౌజీ సినిమా దేని గురించి, దానిలో ప్రభాస్ పాత్ర ఏమిటని పరిచయం చేయడం కోసమే విడుదల చేస్తున్నామని కనుక ఇదేదో బాహుబలి రేంజ్‌లో ఉంటుందని ఊహించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన యోధుడుగా నటిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తున్నారు. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.