
శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ సినిమాలో రవితేజ ప్రేక్షకులను ఎంతగా మెప్పించారో, ఆయన కూతురు మణికంఠగా నటించిన బాలనటి నక్షత్ర కూడా అంతగాను మెప్పించింది.
కేరళకు చెందిన నక్షత్ర ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. ఆమె ఇప్పటికే కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఆరు సినిమాల్లో నటించింది. తొలిసారి తెలుగులో ‘ఇరుముడి’లో నటించింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రజలను మెప్పించింది. టాలీవుడ్లో పలువురు ప్రముఖులు కూడా ఆమె నటనకు ఫిదా అయిపోయారు.
నక్షత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్స్ చూసిన దర్శకుడు శివ నిర్వాణ ఆమె తల్లిని సంప్రదించారు. అనంతరం హైదరాబాద్‌లో ఆడిషన్ నిర్వహించి మణికంఠ పాత్రకు ఎంపిక చేశారు.
తెలుగు భాషపై పెద్దగా పట్టు లేకపోయినా నక్షత్ర తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ట్రాన్స్‌లేటర్ సహాయంతో డైలాగులను నేర్చుకుని షూటింగ్ సమయంలో వాటిని పలికించినట్లు ఆమె గతంలో వెల్లడించింది. శివ నిర్వాణతో పాటు రవితేజ కూడా సెట్స్‌లో తనకు ఎంతో సహకరించారని చెప్పింది.
ఇరుముడిలో నటించినందుకు నక్షత్రకు సుమారు రూ.10 లక్షల పారితోషికం అందినట్లు సమాచారం. అయితే సినీ పరిశ్రమలో ఇలాంటి విషయాలను ఎవరూ అధికారికంగా ధృవీకరించరు కనుక ఇలాంటి ‘టాక్’ ద్వారానే బయటపడుతూ ఉంటాయి. ఇకపై ఆమెకు టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు లభించడం ఖాయమే!