వెంకటేష్‌ కోసం మల్లాది వశిష్ట కథ

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోఆదర్శ కుటుంబం హౌస్ నం.47 చేస్తున్నారు. జూలై నెలాఖరులోగా అది పూర్తయితే ఆగస్ట్ నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్ చేయాల్సి ఉంది.

ఒకవేళ ఆగస్ట్‌లో దాని షూటింగ్‌ మొదలు పెట్టగలిగితే అనిల్ రావిపూడి తప్పకుండా డిసెంబర్‌లోగా పూర్తిచేసి జనవరిలో సంక్రాంతి పండుగకి అందించగలరు. కనుక అప్పటి వరకు వెంకటేష్‌ ఖాళీ ఉండదు.

కళ్యాణ్ రామ్‌కి ‘బింబిసార’ వంటి హిట్ అందించిన మల్లాది వశిష్ట వెంకటేష్‌ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కి తగిన కథని సిద్ధం చేశారట. నిర్మాత డి.సురేష్ బాబు ఆ కథని వినిపిస్తే ఒకే అన్నట్లు సమాచారం.

ఆయన ఓకే అంటే వెంకటేష్‌ కూడా ఓకే చెప్పేసినట్లే భావించవచ్చు. కనుక వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.  

ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం, పాటలకు తమన్ సంగీతం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47లో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ  నిర్మిస్తున్నారు.