ఆ దర్శకుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: మొనాలిసా భోస్లే...

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో జరిగిన కుంభమేళలో పూసల దండలు అమ్ముకుంటూ అందరి దృష్టిని ఆకర్షించిన మొనాలిసా భోస్లేకు మొట్ట మొదట బాలీవుడ్‌కి చెందిన సనోజ్ మిశ్రా ‘ది డెయిరీ ఆఫ్ మణిపూర్’ అనే హిందీ సినిమాలో  అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెకు వెంటనే తెలుగులో అవకాశం లభించింది. శ్రీను కోటపాటి  దర్శకత్వంలో సాయిచరణ్ హీరోగా తీస్తున్న ‘లైఫ్’ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారు. శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజయ్య నిర్మిస్తున్నారు. 

అది పూర్తికాక మునుపే మలయాళంలో ‘నాగమ్మ’ అనే సినిమాలో అవకాశం లభించింది. ఇంత తక్కువ సమయంలో వరుసగా మూడు ఇండస్ట్రీలలో మూడు సినిమా అవకాశాలు లభించడం చాలా అదృష్టమే. ఆ సినిమా కోసం కేరళకు వెళ్ళినప్పుడే అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ‘ఫర్మాన్ ఖాన్’ని గుళ్ళో పెళ్ళి చేసుకుంది. వరుసపెట్టి సినిమా అవకాశాలు వస్తున్నప్పుడు పెళ్ళి చేసుకోవడం వలన వాటిని కాలదన్నుకున్నట్లే అవుతుంది. అయినా ఆమెకు అవకాశాలు లభిస్తే చాలా అదృష్టవంతురాలే అని భావించవచ్చు. 

ఈ పెళ్ళితోనే అందరి దృష్టిని మరోసారి ఆకర్షించిన మొనాలిసా భోస్లే తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి మొదట అవకాశం ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ సినిమా షూటింగ్‌ పేరుతో తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని, అసభ్యకరమైన సన్నివేశాలలో నటించమని ఒత్తిడి చేసేవాడని ఆరోపించింది. తాను అతనితో సినిమా చేస్తున్నంత కాలం నరకం అనుభవించానని కన్నీళ్ళు పెట్టుకుంది. తన తల్లితండ్రులు, కుటుంబం కోసమే అన్ని అవమానాలు భారించానని మొనాలిసా భోస్లే ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే...    

video source: Chota News app