
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి బిగినింగ్ తో ఎంతటి సంచలనాన్ని సృష్టించాడో మనకు తెలిసిందే. అయితే మొదటి పార్ట్ రిలీజ్ అయ్యి అంతటి గొప్ప విజయం దక్కించుకున్న తర్వాత ఇక కంక్లూజన్ లో ఆ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం ఎవరికైనా లక్కీ ఆఫర్ వస్తే వదులుకుంటారా చెప్పండి. కాని అలనాటి తార కాంచన మాత్రం జక్కన్న ఆఫర్ ను తిరస్కరించింది. బాహుబలిలో ఆమెను ఏ రోల్ కు తీసుకోవాలనుకున్నారో ఏమో కాని పార్ట్-2 కోసం కాంచనను అడిగారట. సినిమాలకు 30 ఏళ్ల గ్యాప్ ఇచ్చిన కాంచన బాహుబలి ఒప్పుకుంటే రోజూ జోధ్ పూర్ వెళ్లాల్సి వస్తుందని ఆ ఆఫర్ కాదనేసిందట.
అయినా సరే ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసినా లెక్క చేయలేదని తెలుస్తుంది. మరి ఆమెను ఏ పాత్రలో అడిగారో ఆమె కాదన్న తర్వాత ఆ పాత్ర ఎవరు చేస్తున్నారో అన్న దాని మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ క్రమంలో బాహుబలి మీద మరింత దృష్టి పెట్టారు ఆడియెన్స్. ఇటీవల లీక్ షాక్ తో కాస్త టెన్షన్ పడిన చిత్రయూనిట్ ఇప్పుడు మళ్లీ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అసలైతే 2017 ఏప్రిల్ 28న రిలీజ్ డేట్ అని ప్రకటించిన దర్శక నిర్మాతలు సినిమాను అనుకున్న టైం కన్నా ముందే రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి బిగినింగ్ తో బాక్సాఫీస్ షేక్ చేసిన బాహుబలి కంక్లూజన్ తో ఎలాంటి రికార్డుల మోత మోగిస్తాడో చూడాలి.