
రాష్ట్ర బాషా, సాంస్కృతిక శాఖ రాష్ట్రంలోని ఔత్సాహిక దర్శకులని ప్రోత్సహించడం కోసం చాల చక్కటి ఆలోచన చేసింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున గల రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఇక నుంచి ప్రతీ శనివారాన్ని ఔత్సాహిక దర్శకులు రూపొందిస్తున్న లఘు చిత్రాలని (షార్ట్ ఫిలిమ్స్) ఉచితంగా ప్రదర్శించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ‘సినీవారం’ అని అది ఎంచుకొన్న పేరు కూడా చాలా బాగుంది. ఔత్సాహిక దర్శకులు రూపొందించే ఈ లఘు చిత్రాలని ప్రజలు కూడా ఉచితంగానే చూసి ఆనందించవచ్చు.
ఔత్సాహిక దర్శకులు తాము తీసిన షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్ మొదలైనవి ప్రతీ సినీవారం రవీంద్ర భారతిలో ప్రదర్శించుకోవచ్చు. దాని కోసం వారు ముందుగా రాష్ట్ర బాషా సాంస్కృతిక శాఖకి లేఖ ద్వారా గానీ ఈ-మెయిల్ ద్వారా గానీ లేదా ఫోన్ ద్వారా గానీ తమ సినిమా వివరాలని, అభ్యర్ధనని పంపించవలసి ఉంటుంది. వచ్చిన అభ్యర్ధనలని బట్టి తేదీలు కేటాయించబడతాయి. అభ్యర్ధనలు పంపవలసిన ఈ-మెయిల్: cinivaram.rb@gmail.com. ఫోన్ నెంబర్లు: 9849391432/040-23212832
ఈరోజు ‘సినీవారం’ కనుక రవీంద్రభారతిలో రెండు లఘు చిత్రాలని ప్రదర్శిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి సహాయంతో యువ దర్శకుడు శివ రూపొందించిన రౌండ్ ద క్లాక్ అనే సినిమా, చంద్రపాల్ దర్శకత్వం వహించిన మార్గదర్శి అనే సినిమా ఈరోజు ప్రదర్శిస్తున్నారు. రెండు సినిమాలకి ఆ దర్శకులే కాదని వ్రాసుకొన్నారు. మార్గదర్శి దర్శకుడు చంద్రపాల్ ప్రధాన పాత్ర పోషించాడు కూడా.
మన తెలుగు సినీ పరిశ్రమలోకి కొత్త దర్శకులు, రచయితలు ప్రవేశించడం చాలా కష్టమే కానీ సినీ పరిశ్రమలో వారు ఎప్పుడూ మంచి నైపుణ్యం కల్లవారి కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. కనుక ఈ లఘు చిత్రాల ప్రదర్శన సమయంలో సినీ పరిశ్రమలో వివిధ శాఖలకి చెందిన సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు తదితరులు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఔత్సాహిక దర్శకులు తమ ప్రతిభని నిరూపించుకొని సినీ పరిశ్రమలో ప్రవేశించడానికి ఇక్కడ వారికి మార్గం ఏర్పడవచ్చు. అలాగే ఈ సందర్భంగా నిపుణుల అభిప్రాయలు, సలహాలు, సూచనలు పొందవచ్చు. కనుక షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న యువదర్శకులు, నటీ నటులు, రచయితలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సాంస్కృతిక శాఖ కోరుతోంది.