
గోపీ అట్చర దర్శకత్వంలో సుహాస్, శివానీ నగరం, నరేష్ ప్రధాన పాత్రలు చేసిన ‘హే భగవాన్’ పేరుని ‘హే భల్వంత్’గా మార్చిన సంగతి తెలిసిందే. ఫిభ్రవరి 20న విడుదల కాబోతున్నందున హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుహాస్ తన కెరీర్ మొదట్లో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి అభిమానులతో పంచుకున్నారు. “ఓ సినిమాలో ఓ టాప్ హీరోయిన్ పక్కన (సైడ్ క్యారక్టర్) నటించే అవకాశం వచ్చింది. నేను సెట్స్‌లోకి వెళ్లి ఆమెను పలకరించినప్పుడు అందరి ముందే ఇతనిని ఎందుకు పిలిచారు? అంటూ అవమానకరంగా మాట్లాడింది. కానీ నేను చిన్నగా నవ్వేసి ఊరుకున్నాను తప్ప తీవ్రంగా రియాక్ట్ కాలేదు.
సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చే ప్రతీ ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. కనుక నాలాగే లైట్ తీసుకొని ముందుకు సాగిపోతేనే సినీ పరిశ్రమలో నిలబడగలరు. నాడు నన్ను ఓ టాప్ హీరోయిన్ అవమానించింది. కానీ కట్ చేస్తే కీర్తి సురేష్ వంటి ఓ టాప్ హీరోయిన్‌తో కలిసి నటించాను. ఆమెకు మా ఇంటి భోజనం రుచి చూపించాను కూడా,” అని సుహాస్ అన్నారు.
సుహాస్ 2019లో రష్మిక మందన (డియర్ కామ్రేడ్), అదే సం.లో సమంత (మజిలీ) సినిమాలలో నటించారు. కనుక వారిద్దరిలో ఎవరో ఒకరు సుహాస్‌ని అవమానించి ఉండవచ్చు.
‘హే భల్వంత్’ సినిమాలో అన్నపూర్ణ, సుదర్శన్, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకి కధ అందించారు. ఈ సినిమాకి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: మహిపాల్ రెడ్డి, ఎడిటింగ్: విప్లవ్, ఆర్ట్: ఏ రామ్ కుమార్ చేశారు.
త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిభ్రవరి 20న విడుదల కాబోతోంది.