
ప్రముఖ మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందుతున్న టాక్సిక్ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్) సినిమాలో నయనతారతో సహా ఐదుగురు హీరోయిన్లున్నారు. ఇటీవల టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైంది. దానిలో కారులో ఓ ఇంటిమేట్ సన్నివేశం ఉంది. ఓ మహిళా దర్శకురాలి సినిమాలో ఇటువంటి అభ్యంతరక సన్నివేశాలు తీయడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆమె స్పందిస్తూ, “ఈ విమర్శలను నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. మహిళా దర్శకులు కూడా ఇటువంటి సన్నివేశాలు తీయగాలరని అందరూ గుర్తించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను,” అని అన్నారు. ఆమె చెప్పిన ఈ జవాబుపై మళ్ళీ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కానీ ఆమె సోషల్ మీడియాని తన సినిమాలకు తప్ప వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు. కనుక సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేస్తున్నా తాను పట్టించుకోబోనని గీతూమోహన్ దాస్ స్పష్టం చేశారు.
ఈ సినిమాలో నయనతార, కియరా అద్వానీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి మార్చి 19న విడుదల చేయబోతున్నారు.