సంక్రాంతి బరిలో నుంచి రెండు పెద్ద సినిమాలు అవుట్?

భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’ ప్రేక్షకులను నిరాశపరిచింది. బాహుబలి ప్రభాస్‌ వంటి పాన్ ఇండియా స్టార్‌ మారుతి వంటి చిన్న దర్శకుడికి అవకాశం ఇస్తే వృధా చేసుకోవడమే కాకుండా ప్రభాస్‌ కెరీర్లో ఓ ఫ్లాప్ జోడించారని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు.

మారుతికి మంచి పట్టున్న హర్రర్ కామెడీతో సరిపెట్టుకోకుండా అనవసరమైనవన్నీ జోడించడం వలననే సినిమా గందరగోళంగా మారిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. 

సినిమా రివ్యూలు కూడా ఇదే చెపుతున్నాయి. కొన్ని మీడియా సంస్థలు రాజాసాబ్‌కు 2.5/5 రేటింగ్ ఇవ్వగా మరికొని కేవలం 2.0/5 మాత్రమే ఇచ్చాయి. ఇవి సరిపోవన్నట్లు రాజాసాబ్ సినిమా టికెట్స్ విషయంలో కూడా తెలంగాణలో గందరగోళం ఏర్పడింది. గురువారం అర్ధరాత్రి ప్రభుత్వం మెమో జారీ చేయగా శుక్రవారం మధ్యాహ్నం దానిని హైకోర్టు కొట్టివేసింది. 

సినిమాకి మిశ్రమ స్పందన వస్తుండటంతో సంక్రాంతి బరిలో వెనకబడిపోయినట్లే అనిపిస్తోంది. మరోపక్క కోలీవుడ్‌ హీరో విజయ్‌ సినిమా జన నాయకుడు విడుదల చేయకుండా మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. కనుక అది కూడా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నట్లే.

కనుక ఇప్పుడు ఇప్పుడు బరిలో చిరంజీవి-‘మన శంకర వరప్రసాద్ గారు’, నవీన్ పోలిశెట్టి-‘అనగనగా ఒక రాజు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి,’ శర్వానంద్- ‘నారీ నారీ నడుమ మురారీ,’  సినిమాలు మిగిలాయి.