
మహాప్రయాగ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ అందరి దృష్టిని ఆకర్షించిన అందమైన అమ్మాయి మొనాలిసా భోస్లేని అదృష్టం వరించింది. ఆమెకు తెలుగు సినీ పరిశ్రమ ‘లైఫ్’ ఇవ్వబోతోంది.
శ్రీను కోటపాటి దర్శకత్వంలో సాయిచరణ్ హీరోగా తీస్తున్న ‘లైఫ్’ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారు. శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి అప్పుడే మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు కూడా. త్వరలో రెండో షెడ్యూల్ మొదలు పెడతామని దర్శకుడు శ్రీను కోటపాటి చెప్పారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలను కధాంశంగా తీసుకొని ఈ ‘లైఫ్’ సినిమా ద్వారా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చెప్పారు.
ఈ సినిమాలో సాయాజీ షిండే, ఆమని, సురేష్, తులసి, రచ్చ రవి ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం సుకుమార్, కెమెరా: మురళీమోహన్ రెడ్డి చేస్తున్నారు.
మొనాలిసా భోస్లే హిందీ, మలయాళంలో రెండు సినిమాలు చేయబోతున్నారు. సనోజ్ మిశ్ర దర్శకత్వంలో ‘ది డెయిరీ ఆఫ్ మణిపూర్’ (హిందీ), మరొకటి పి. భిను వర్గీస్ దర్శకత్వంలో ‘నాగమ్మ’ (మలయాళం) సినిమాలు చేయబోతున్నారు.
తెలుగు ‘లైఫ్’ పూర్తిచేయగానే ఫిబ్రవరి నుంచి హిందీ సినిమా షూటింగ్ మొదలవుతుంది. అది పూర్తి చేసిన తర్వాత ఆగస్టులో మలయాళ సినిమా మొదలుపెడతారు.