చికిరి చికిరి కోసం ఇంత కష్టపడ్డారా!

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్‌ హీరోగా తీస్తున్న ‘పెద్ది’ నుంచి ఇటీవల విడుదల చేసిన ‘చికిరి చికిరి’ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. చిటికెలు వేస్తూ మోకాళ్ళపై నుంచి కొద్దిగా లేచి రామ్ చరణ్‌ ఇచ్చిన డాన్స్ మూమెంట్స్, క్రికెట్ బ్యాట్ పట్టుకొని చేసిన డాన్స్ అద్భుతంగా ఉన్నాయి.

పాట, మ్యూజిక్, డాన్స్ అన్నీ సరిగ్గా కుదరడంతో అప్పుడే దానికి వంద మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. మహారాష్ట్రలో ఓ పెద్ద కొండపై ఆ పాట షూట్ చేశారు. కానీ రామ్ చరణ్‌తో సహా షూటింగ్‌లో పాల్గొనేవారు, షూటింగ్‌ కోసం ఉపయోగించే కెమెరా, స్టాండ్స్, రిఫ్లక్టర్స్ర్స్ వగైరా భుజనా వేసుకొని కొండపైకి చేరుకునేందుకు పెద్ద సాహసమే చేశారు.

ఆ వీడియోని రామ్ చరణ్‌ నేడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్‌ లేదా దర్శకుడు బుచ్చిబాబు అనుకుంటే ఆ పాటని మరెక్కడైనా తీయవచ్చు. కానీ ఆ పాట కోసం వారందరూ అంత రిస్క్ తీసుకొని కొండపైకి చేరుకొని చిత్రీకరించారు. ఆ పాట వెనక ఇంత కష్టం ఉందా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తే! 

చిన్న చిన్న పదాలతో బాలాజీ వ్రాసిన పాట అద్భుతంగా ఉందనుకుంటే దానిని ఏఆర్ రహ్మాన్ స్వరపరిచిన తీరు, ఇచ్చిన సంగీతం ఇంకా అద్భుతంగా ఉంది. ఈ పాటని మోహిత్ చౌహాన్ అంతే అద్భుతంగా పాడారు.    

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా నటిస్తున్న జాన్వీ కపూర్‌ని కూడా ఈ పాటలో చూపారు. ఈ సినిమాలో కోచ్‌ గౌరు నాయుడుగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌, ఇంకా జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు. 

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.