మంచువారు సమర్పించు మోహన రాగం

ప్రముఖ తెలుగు సినీ నటుడు మంచు మనోజ్‌ ‘మోహన రాగ’ అనే పేరుతో కొత్తగా ఓ మ్యూజిక్ కంపెనీ ప్రారంభించారు. సంగీతం, పాటలపై తనకున్న అభిరుచితోనే ‘మోహన రాగ’ని స్థాపిస్తున్నానని చెప్పారు.

‘లోకల్ హార్ట్స్-గ్లోబల్ బీట్స్’ అనే విధానంతో తమ సంస్థ సంగీత ప్రపంచంలో కొత్తదనం చూపగల యువ కళాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

మన పాటలు, మన సంగీతాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ రంగంలో సృజనాత్మకత, మంచి నైపుణ్యం ఉన్నవారిని తమ సంస్థ ప్రోత్సహిస్తుందని మంచు మంచు మనోజ్‌ చెప్పారు.

ఎటువంటి భయాలు, సంకోచాలు లేకుండా కొత్త రకం సంగీతం సృష్టించగల యువ కళాకారులకు ఇదే మా ఆహ్వానమన్నారు మంచు మనోజ్‌.          

మంచు మనోజ్‌ గత 11 ఏళ్ళుగా వైవాహిక, కుటుంబ సమస్యల కారణంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉండిపోయారు. గత ఏడాది తిరిగి వచ్చిన తర్వాత తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణులతో గొడవలు పడటంతో మంచు కుటుంబంలో అందరూ అప్రదిష్ట పాలయ్యారు.

కానీ ఆ తర్వాత మంచు మనోజ్‌ నటించిన భైరవం, మిరాయ్ రెండు సినిమాలు హిట్ అవడంతో మళ్ళీ గాడిన పడ్డారు. ఇప్పుడు ఈ ‘మోహన రాగ’ మ్యూజిక్ కంపెనీతో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టి కొత్త ప్రయోగానికి సిద్దం అవుతున్నారు.