అక్కినేని ఇంట్లో మళ్ళీ పెళ్ళి బాజాలు

అక్కినేని నాగార్జున ఇంట్లో మళ్ళీ మరోసారి పెళ్ళి బాజాలు మ్రోగబోతున్నాయి. గత ఏడాది పెద్ద కొడుకు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్ళి జరుగబోతోంది. నాగార్జున దంపతులు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ చిన్న కొడుకు వివాహానికి ఆహ్వానించారు. 

గత ఏడాది నవంబర్‌లో అఖిల్ అక్కినేని, జైనబ్ రవడ్జీతో వివాహ నిశ్చితార్ధం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవడ్జీ కుమార్తె అయిన  జైనబ్ రవడ్జీ కూడా కళాకారిణే. వారి ప్రేమని ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి వివాహ నిశ్చితార్ధం జరిపారు. జూన్ 6వ తేదీన హైదరాబాద్‌లో అఖిల్ అక్కినేని, జైనబ్ రవడ్జీ పెళ్ళి జరుగబోతున్నట్లు తెలుస్తోంది.