
రెండు తెలుగు రాష్ట్రాలలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు తమ సమస్యల పరిష్కారానికి జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించడం, దానిపై ఏపీ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, దాంతో బంద్ ఆలోచన విరమించుకోవడం తెలిసిందే. కానీ థియేటర్స్ యజమానుల సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్స్ యజమానులు విశాఖపట్టణంలో సమావేశమయ్యి చర్చిస్తున్నారు.
సినిమాల ప్రదర్శనకు అద్దెకు బదులు కలెక్షన్స్‌లో పర్సంటేజ్ ఇవ్వాలని థియేటర్స్ యజమానులు కోరుతున్నారు. పెద్ద సినిమాలకు సినిమా థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నప్పటికీ, తమకు నామ మాత్రంగా అద్దె చెల్లిస్తున్నారని, అది థియేటర్స్ నిర్వహణ ఖర్చులకు కూడా సరిపోక తీవ్రంగా నష్టపోతున్నామని థియేటర్స్ యజమానులు వాదిస్తున్నారు. కనుక కలెక్షన్స్‌లో పర్సంటేజ్ ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే థియేటర్స్ బంద్ ప్రతిపాదన వెనుక నలుగురు ప్రముఖ నిర్మాతలున్నారని, పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఆ నలుగురే ఉద్దేశ్యపూర్వకంగా థియేటర్స్ బంద్ చేయించాలని కుట్ర చేశారని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించి, పోలీసులను విచారణకు ఆదేశించారు. ఈ నేపధ్యంలో నేడు విశాఖలో జరుగుతున్న ఈ సమావేశం చాలా వాడి వేడిగా సాగుతోంది.